Thursday, October 28, 2010

చీకటి


చీకటిచీకటి
ఎంతోచీకటి
మృత్యువు అసలు
స్వరూపంచీకటి

నీలాకాశపు
నిగమము చీకటి
సౌందర్యానికి
ఆకృతిచీకటి

రాత్రికి ఆఃక్రుతినొసగె
చీకటి
మనిషికి
కలలని పంచే చీకటి

అచింత్య మైనది
అనంత మైనది
అద్వితీయమగు
నదియేచీకటి

అంతా చీకటి
ఎంతో చీకటి
అంతా ఇంతే
చీకటి చీకటి

ఈ లోకం లో

ఈలోకం లొ, ఈ నా దేశం లో
ఈ నా ఇప్పటి దేహం తో
ఎన్నాళ్ళైనా బ్రతకట మిష్టం
ఎపుడు ర్రాలినా ఇష్టం //
ఈలోకం లొ//

సంసారం సాగరమైతే
జలక్రీడగాజీవనమిష్టం
తిరిగి పుట్టుటకే మరణం ఐతే
మరణం అంటే మరి మరి ఇష్టం //
ఈలోకం లొ//

పొరపాటున మోక్షం వస్తే
పుట్టుక లేకుండా పొతే
ఇలా తలానికి దూరంగా
ఎలాగాన్నదే నాకు భయం //
ఈలోకం లొ//

బాల్యం అంతా ఆటగా
వయసే పున్నమి
బాటగా
మనసే చల్లని మాటగా
బ్రతుకంతా శ్రుతిలో కలిసిన పాటగా నే పాడగా //
ఈలోకం లొ//

(ఈ పాట స్వరపరిచింది శ్రీ పాల గుమ్మి విశ్వనాథం గారు )

నా జ్ఞాపకాలు – అనుభవాలు ( లెక్కలతో పోరాటం - 1

                          రవీంద్రనాథ్ మార్చాల

                                         
      బడిలో పిల్లలందరికి కష్టమైనది, ఇష్టం లేనిది, విసుగుతెప్పించేది ఎదైనా వుంది అంటే అది MATHSమాత్రమే….చిన్నపుడు, మన చదువు మహా దారుణంగా సాగేది. అసలు ఆ సమయం లో బడి కి వెళ్ళేది చదువుకోవటానికి అని తెలీక, తోటి పిల్లల్ని కొట్టటం ఇంటికి జనాల్ని తీసుకు రావటం మన దినచర్య గా వుండేది. 

          అందరిలా నేను పలక మీద అక్షరాలు, అంకెలు త్వరగానే నేర్చుకున్నా...పలక మీద సీనియారిటి సాధించాక పుస్తకాలు వచ్చాయి...గుట్టు చప్పుడు కాకుండా వాటితోనే ఎక్కాల పుస్తకం కూడ చేరింది ....అ రోజు అలా చాటుగా ప్రవెశించిన దాన్ని పోన్లే చిన్న పుస్తకం, మహా అయితె ఒక 10 పేజిలు అనుకుని వదిలేశా...... అపుడు తెలీలేదు, "ఒక చిన్న పుస్తకం నా బల్యాన్ని మింగేస్తుంది అని... 

సరేలెమ్మని "కమిట్ అయ్యాం, ఏటి సేత్తాం" అనుకుని పుస్తకాలన్ని సర్ది పెట్టె లో పెట్టి తాళం వేసాను...అలా నా జీవితం లో లెక్కలు అనే 'విలన్ ' ముందు వామన అవతారంలా చిన్నగా ఎక్కాల పుస్తక రూపంలో ప్రవేశించింది....

చిన్నపుడు ప్రైవేటు శాస్త్రి మాస్టారి దగ్గర, ఆయన నాతొ నోటి తో కంటే, బెత్తం తోనే ఎక్కువ మాట్లాడేవారు...పైగా ప్రతి ఆదివారం ఎక్కాలు అప్పజెప్పాలి..ఆదివారం వస్తుందని నాకు సోమవారం నుంచే భయంగా వుండెది...మొదట్లో ఎక్కాలు ( అంటే 1 నుంచి 6 వరకు) తేలిగ్గానే వున్నట్లుగా వుండేవి ( మన బుర్ర లో వున్న fuel అక్కడి దాకానే సరిపొయింది) ...తర్వాత 7 వ ఎక్కం అంటేనే ఏడుపు వచ్చేది...దానితో కొన్నాళ్ళు పోరాడాల్సి వచ్చింది...అలా లాక్కుంటూ, కుంటుకుంటూ 13 వ ఎక్కం వరకు వెళ్ళి, ఇక బండి లాగ లేక ఆపేసాను...అపుడపుడు మాస్టారు, బెత్తం తో రీచార్జ్ చేస్తే మళ్ళా కాస్త కదిలేది. అలా బడి జీవితం 20 వ ఎక్కం వరకు వెళ్ళకుండానే ముగిసింది...

ఇంకా ప్రెవేటు లో ఎక్కాల బాధలు కాకుండా లెక్కల పరీక్షలు వుండెవి...నాకేమో అవి జీవితానికే పరీక్ష లా వుండెవి...ప్రతి పరీక్ష ఎలా తప్పించుకోవాలి అన్న ఆలొచన తోనే సమయం గడిచిపొయేది. ఇంకా చదవటానికి సమయం ఏది, పాస్ అయ్యే అవకాశం ఏది...ప్రతి పరీక్ష లో ఫెయిల్ అవుతూ..మస్టారి దగ్గర "వీడిక లెక్కల్లో పాస్ అవ్వడు" అనే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వుండేవాడిని...అపుడె ఒక వర్షం కురిసిన రాత్రి, ఇంట్లో కరెంటు పోవడం మనకి ఆలోచన రావటం ఒక్కసారే జరగలేదు, ఒక గంట తేడాగా జరిగాయి...
బడి పరీక్షల్లో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు వుండేవి...మనకి కూడికలు తప్ప తీసివేతలు కూడా వచ్చేవి కాదు...ఎమైనా అంటే అప్పు తెచ్చుకోవలి అనేవారు...అప్పటికి మనకి ఇంకా అప్పులు ఎవరు ఇస్తారో తెలీదు కదా...అందుకని మన గణితావధానం కూడికలతో ముగిసేది...

ఇలా కాదని షార్ట్ కట్ కోసం ప్రెవేటు చుట్టు పక్కల గాలించసాగాను...అక్కడే దొరికాడు, సుబ్బి గాడు...వీడు కాస్త "  + , - , * , / " చేసేవాడు...( అందుకే కావొచ్చు, వీడు ఇపుడు బ్యాంక్ గుమస్తా గా రాణిస్తున్నాడు.)...ఇక అప్పటి నుంచి మాస్టారి ప్రత్యేక దృష్టి నా మీది నుంచి మరల్చటం కోసం, నా దూర దృష్టి ( కాపి చేయటం) మెరుగుపరచుకున్నా....కాని కాలం కలసి రాక ఎపుడైనా రాహువు వక్ర దృష్టి తో చూసినపుడు గోడ కుర్చి వేసి, కింద వెళ్ళె చీమల్ని లెక్కపెట్టేవాడిని...ఇలా  ఆదివారాలు, గోడ కుర్చీలు నా చిన్నప్పటి డైరి లో నాగార్జున, టాబు లా కలిసిపోయాయి..
ఒకసారి బడి లో పెట్టిన పరీక్ష లో, వేరే ఎవ్వరికి రాని మార్కులు వచ్చినందుకు టీచర్ మనకి ఒక బిరుదు కూడా ఇచ్చింది..( మనకి వచ్చిన మార్కులు "సున్నా" ).               

Tuesday, October 5, 2010

నగేష్ లేడు ,నవ్వులున్నై

     ఏడవడానికి కారణం కావాలేమో కానీ నవ్వడానికి సందర్భం అవసరం లేదు.
నవ్వడం, నవ్వించడం ఒక గొప్ప వరం..



        
మనుషులు చాలా ఉంటారు కానీ నవ్వించే మహా మనుషులు కొంతమందే ఉంటారు. అలాంటి కోవకు చెందిన మహా మనిషి హాస్య నటుడు నగేష్.
నవ్వించి నవ్వించి నవ్వుల్ని ప్రోది చేసుకుని దాచుకొండర్రాఅని ఇహ లోకం లో
తన పని ముగించుకుని, అలిసి పోయినస్వర్గ వాసుల్ని తన నవ్వులతో సేద తీర్చడానికి హడావుడిగా వెళ్లిపోయిననగేష్  పాపం పసివాడు సినిమా లో నటన మనల్ని ఇంకా ఏడిపించట్లేదూ......?
            
నగేష్ భౌతికంగా మనతో ఉండరు.కానీ ఆయన పంచిన నవ్వులు ఉంటాయి . మనతోనే శాశ్వతంగా
               మేము ఉండే మా ఇల్లు ఒక పది ఇళ్ళున్నకాంపౌండ్ . అందులో మా ప్రక్కన కరణం గారూ , వారి ప్రక్కన ఒక వకిలు గారూ,అ ప్రక్కన ఇంట్లో ఒక  పాలిటెక్నిక్   కాలేజి లెక్చరరు , (వాళ్ళ ఇంట్లో, ఆయన తండ్రిగారు బంగారం పని చెస్తూ ఉండే వారు. )  ఆ ప్రక్కన సహకార శాఖ లో పని చేసే ఒక శెట్టి గారూ ఉండేవాళ్ళు.


    మరో వరస ఇళ్లన్నీ అక్కడికి దగ్గర లోనే ఉన్న పల్లెలో వ్యవసాయం ఉన్న కామండులకి సంబంధించి దాదాపు ఐదు ఇళ్లు ఉండేవి. . వాళ్ళ ఇళ్ళల్లోనే రెవిన్యూ శాకః లో పని చేసే సుబ్బా రావు గారు అద్దె కుండే వారు. ఆయన ఆ ఇంట్లో కి రావడమే మాకు ఎంతొ సహాయమయింది. అలాగని శాఖా పరమైన సహాయం ఆయన దగ్గర మాకు    ఎప్పుదూ  అవసరం రాలేదు
.
    ఆయన ఇంటి ముందు మాత్రం బిళ్ళ బంట్రోతు ఎప్పుదూ ఉండే వాడు.
     ఎప్పుడు   చూసినా ఎక్కువగా టూరు లోనే   ఉండేవారాయన
.
             మా పెరట్లోమందార నందివర్ధనం, కనకాంబరం, మల్లె, బంతి, చిట్టి చేమంతి, మొదలైన పువ్వుల మొక్కలు,  నిమ్మ,దబ్బ  ,కొబ్బరి , జామ ,పనస,అల్లనేరేడు,దానిమ్మ, మామిడి మొదలైన చెట్లు అన్ని ఉండేవి. ప్రొద్దుటే లేస్తే మొక్కలకి నీళ్ళు పోయడం, పాదులుచేయడం లాంటి పనులలో అమ్మకి సాయపడటం మాకు ఒక పని.    దొడ్లోకి రాగానే ఎదురుకుండా తహసిల్దరుగారు వారి  హంగులు,  ,ఆర్భాటాలు  కనిపించేవి.వాళ్ళింట్లో నే ఆయన బావమరిది, సహకార శాఖలో పనిచేస్తూ ఒకదగ్గరే  కలిసే ఉండేవారు.
 పరోపకారం అన్న దానికి మారుపేరు ఆయన. ఇది ఇలా ఉంటె నా వరకు వస్తే           
         ఉద్యోగం లో చేరడం అనేది నెనెప్పుడూ  ఆలోచించలేదు.అసలు విశ్లేషించుకుంటే నన్ను నేను ఏవిషయం లో కూడా ఒక గోలు పెట్టుకుని ,ఏదో కష్ట పడి దాన్ని సాధించానని చెప్పడానికి  ఏమి లేదు. రోజులు గడుస్తున్నై, వాటితో బాటే అవకాశాలూ వచాయి. గుంపులో గోవింద లాగ అన్దరూ ఏమి చేస్తే ,మనం కూడా వారి తో కలిసిపోయి అదే పని చేయడమే.
 మనసులో యిదేలాగా, అదెలాగ అని ఎన్నో ప్రశ్నలు వచెవెఇ. కాని వాటికి  ఓపికగా సమాదానాలిచే తిరిక పెద్దవాళ్ళకి లేదు,
అలాగని మనం అడిగేసామా అంటే అంత సిను అస్సలు లేదు.
కల్లెర్రజుసి చూసే పెద్దవాళ్ళని ప్రశ్నించే దమ్ము నాకు ఆ రోజుల్లో లేదు.
కానీ కో కొల్లలుగా వస్తున్నా ప్రశ్నల్ని నాలో నేనే ప్రశించుకుని, చాలాకాలం వరకు ఒక ప్రశ్న గానే మిగిలి పోయన్నేను.
ఎందుకని అడిగినా, విమర్శించినా నాదగ్గర సమాధానం లేదు. నేను 10th exams వ్రాసాక ఇంటరు లో జేరే ప్రహసనం తమాషాగా ఉండింది. అది తర్వాత చెప్తా.  


                                               *     *       *      *     *    *     *
         సరిగ్గా ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడే వ్రాసా ననుకుంటా. ఏమ్ప్లయిమేంట్ ఆఫీసు కి వెళ్లి 10th   పూర్తి కాగానేఏమ్ప్లోయి మెంటు కార్డు అప్పట్లో ఒకఅవసరం గా భావించే వాళ్ళు.అందరిలాగే నేను కూడా కార్డు తిసుకున్నా. అందులో సితమ్మగారని మాకు , మా కుటుం బానికి తెలిసిన ఆవిడ పని చేస్తూ ఉండేవారు. వెళ్ళగానే  procedure అంతా చెప్పి వెంటనే కార్డు చేతికి ఇచ్చి పoపించారావిడ . ఆ క్షణం లో ఏదో సాధించేసినట్లు ఒక ఫీలింగు . అప్పట్లో దాన్ని క్రమం తప్పకుండా రెన్యువల్ చేయించుకోవాలి . అల్లాగే చేసేవాళ్ళం. దాంతో బాటే టైపు నేర్చుకోవడం కూడా ఒకటి . నేను, మా చిన్నక్క,పెద్దక్క ప్రతినిత్యము టైపు కి వెళ్ళేవాళ్ళం.
         
              దీంతో బాటే ఇక్కడ చెప్పాలిసిన ముఖ్యులు కి.శే. వేణుగోపాల రావు గారు. ఆయన్ని గురించి చెప్పకపోతే నా తెలివితేటలకి అహంకారాన్ని జత చేసినదాన్నవుతాను. నా యీ జీవితం స్వార్జితం తో, ఎవరిమీదా ఆధారపడకుండా సాగుతోందంటే ఇదంతా
వేణుగోపాల రావు గారు మాకు పెట్టిన విద్యా దానం వల్లనే అనడం ఎంత మాత్రం సందేహం లేదు. బొటాబొటీ సంపాదనతో మా కుటుంబంలో దాదాపు పది మందిని పోషించవలసిన బాధ్యత మా నాన్నగారిది. అలాంటప్పుడు   ఇంతమందికి ఖర్చు  పెట్టి చదువు చెప్పించాలంటే అయే పని కాదు. అలాంటి టైము లోనేవేణుగోపాల రావు గారు మాకు పరిచయ మయ్యారు.

         మేముండే కాంపౌండ్ లోనే వాళ్ళు కూడా అద్దెకుండే వాళ్ళు. లలిత కళలన్నా, పిల్లల కార్యక్రమాలన్న ఆయనకి చాలా ఇష్టం. అప్పుడే మా కంపౌండు లో నవజీవన బాలానంద సంఘం అన్నదాన్నొక దాన్ని నా స్నేహితుడు, కిషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తే దానికి   వేణుగోపాల రావు గారు సలహాలు, కార్యక్రమాల నిర్వహణ కి మాట సాయము చేస్తుండేవారు. నేను   10th  చదువుతూ చిన్న, చిన్నగా గేయాలు, నాటకాలు, పాటలు వ్రాస్తుండే  దాన్ని. ఈ సందర్భం లో నేను స్వార్ధం అన్న ఒక నాటిక రాసి, కిషన్ మా ఇంటికి వస్తే చూపించాను. అది చూసి కిషన్ ,దీన్ని నవంబెర్ లో మన బాలల కార్యక్రమాల్లో వేద్దామని చెప్పి ఆ పనికుపక్రమించాడు. 
  
    అప్పుడే వేణుగోపాల రావు గారు యమలోకంలో కరప్షన్ అన్న ఒక నాటకం వ్రాసి పిల్లలన్దరితోను కలిసి ఆ నాటకాన్ని వేయించాడు. దాన్లో ప్రదీప్, ఆనంద్(ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్లో పని చేస్తున్నాడు),విద్యాసాగర్,మధు మొదలైనవాళ్ళు పాత్రలు పోషించారు. అద్భుతమైన ఆ నాటకాన్ని ఎప్ప్పటికి మర్చిపోలేము. దాని తర్వాతే చాలాకాలానికి ఎన్.టి రామారావు గారూ నటించిన యమ దొంగ సినిమా వచ్చింది.   ఇప్పుడు ఆ  కిషను లేదు, వేణుగోపాల రావు గారు లేరు. మిగతావాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు. కొంతమంది అపుడప్పుడు పలకరిస్తూ ఉంటె కొంత మంది ఎక్కడున్నారో తెలిదు. గుండేరావు మమయ్యగారి ఇంటి అరుగు మీద మా నాటకాల ప్రదర్శన జరుగుతూ ఉండేది. ఆ వేదిక మాకిచ్చినందుకు మా బాలానంద సంఘం  తరఫున ఆయనకీ మేము గౌరవం గా ఏదో బిరుదు బ్బహుష కళా కిరీటి అనో మరేదో  కూడా మా సంఘం తరఫున ఇచ్చినట్లు జ్ఞాపకం.
  


    





ఈ రోజు ఆఫీసుకి వెళ్తుంటే

                
           ఈ  రోజు ఆఫీసుకి వెళ్తుంటే నల్లగొండ బస్సు స్టాప్ లో  ఒక తెల్ల ప్యాంటు చక్కగా టక్ చేసుకుని ఒక శాల్తీ బస్ ఎక్కాడు. అతను బస్సు ఎక్కగానే చూసి చెకింగ్ అనుకుని, ఒక సరి బాగు తీసి నా టికెట్ ఉందొ లేదో చెక్ చేసుకుని బాగ్ జిప్ పెట్టేసి కూచున్నాను. ఇంతలో కండక్టర్ వచ్చి అతనితో ఏదో మాట్లాడాడు. కాసేపు డ్రైవర్ వెనక నించున్న అతను , ఖాళి  అయిన సీనియర్ సిటిజన్    సీట్ లో కూర్చున్నాడు.బస్సు పెద్దగ రష్  లేదు.
 
            సరిగ్గా బస్సు అబిడ్స్ దగ్గరికి వచ్చింది. కాసేపు అయితే బస్సు ఆగి స్టాపు లో ఉన్న వాళ్ళు వచ్చి బస్సు ఎక్కుతారు. ఇంతలో నేను అంత సేపటి నించి  గమనిస్తున్న శాల్తీ గబుక్కున లేచి ఆడ వాళ్ళు బస్సు ఎక్కే ముందు డోరు లోంచి గబుక్కున ఉమ్మేశాడు. అంతే హాయిగా వచ్చి కూర్చున్నాడు. పరిగెత్తుతూ వచ్చి బస్సు ఎక్కాలనుకున్న ఒక అమ్మాయి  గబుక్కున ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. ఇవేవి గమనించకుండానే డ్రైవరు బస్సు ని ముందుకి తీసికెళ్ళి  పోయాడు .
        
           నాకు ఒళ్ళు  మండింది. కండక్టర్ తో ఆయన ఎవరు అని అడిగా . అందుకు అతను కంట్రోలర్ ని     అని ఎక్కాడమ్మా. టికెట్ కూడా తీసుకో లేదు తనలో తనే అనుకుంటున్నట్టు అన్నాడు. ఇదేమ పధ్ధతి? అలా ఉమ్మేయడం ? అడిగాను నేను. రెండు దొబ్బులు పెట్టమ్మా సక్కగైతాడు. అన్నాడు. ఇంతలో తలెత్తి చుసేన్తలోనే డ్రైవర్కిచేయి చూపిస్తూనే బస్సు స్లో కాగానే దిగిపోయాడు. వాణ్ణి దొబ్బులు పెట్టలేక పోయినండుకి నన్ను నేనే దొబ్బులు పెట్టుకుని, లక్డిక పూల్ బస్సు స్టాప్ లో దిగి మెహిదీపట్నం బస్సు ఎక్కడానికి పరిగెత్తా 
.

Sunday, October 3, 2010

ఆది గురువు

             మా ఇంట్లో మా అమ్మ గారు మాకు ఆది గురువు  .మా పిల్లలన్దరికీ దాదాపు  మూడో తరగతి దాకా ఆవిడే పాఠాలు, పెద్ద బాల శిక్ష మొదలు ఎక్కాలు, గుణింతాలు , A,B,C,D లు నాలుగు రకాలు దాదాపుగా మొత్తం పుస్తక జ్ఞానం అమ్మే నేర్పించింది. మా వీధిలో అందరు రాజ్యలక్ష్మి కన్యా పాథశాల లో చదువుకున్నామని అంటూ ఉండే వాళ్ళు. మా నాన్న నన్ను తీసికెళ్ళి బేసిక్ స్కూలు లో సీతమ్మ టీచర్ కి అప్పచెప్పి మధ్యాన్నం వచ్చి ఫార్మాలిటీస్    అడ్మిషన్  కి సంబంధించి పూర్తి  చేస్తానని చెప్పి వెళ్లారు. ఆ రోజు ఆయన మధ్యాన్నం వీలు కుదరక  మధ్యాన్నం  ఇంటికి వెళ్ళాక నాతొ   నిన్న కూర్చున్న క్లాస్ లోనే  కూర్చో , నేను ఇవ్వాళ వస్తా నన్నారు. ఆ రోజు మధ్యాన్నం ఆయన వచ్చేటప్పటికి నేను మూడో క్లాస్ లో కూచుని, ఏడుస్తున్నాను. నాన్న రెండో క్లాసు లో కూచోమంటే,  సితమ్మ టీచరు నన్ను   మూడో తరగతి లో కూర్చో పెట్టింది. నాన్న తంతారేమో  అని నా ఏడుపు అన్నమాట. 
            నాన్న వచ్చి నన్ను వెతికి, నా క్లాసు లో నన్నుచుసి అప్పుడే రెండవ క్లాసు  నుంచి నేను కూర్చున్న  మూడవ క్లాసు లోకి అడుగు పెడుతున్న సీతమ్మ టీచర్ తో మాట్లాడు తున్నారు. ఆవిడ ఏం చెబుతుందో అని భయం. ఇంతలో ఆవిడ చెప్పిన మాటలు నాకనందం కలిగించాయి .   ఆవిడ నాన్నతో మీ అమ్మాయి నాకే పాఠాలు చెప్పేట్టు   ఉంది. తనకి రెండవ తరగతి అక్కర్లేదు, మూడవ తరగతి లోనే    అడ్మిషన్   చేద్దాం. అన్నారు. ఆవిడ ఆ స్కూల్ కి అప్పుడు ఆవిడ  ప్రైమరీ పాథశాల కి ప్రధానోపాధ్యాయు రాలు అని గుర్తు. 
         ఇంకేముంది, మనం మూడో క్లాస్ కి వచ్చాం నాన్న ఇంట్లో అమ్మతో ఈ విషయం చెబుతుంటే నాకెంతో గర్వం అనిపించింది. 
       అలాగని నేనేమి జీనియస్    కాదండోయ్ . అదంతా అమ్మ చదువు చెప్పిన  చలవ.  మాత్రు    దేవో భవ.(అమ్మ ఉన్నప్పుడు ఆవిడకి నేను ఎప్పుడు నా మనసులో భావాలు చెప్పుకో  లేక పోయాను.ఇప్పుడు చెప్పాలంటే ఆవిడ లేరు. )
       

Saturday, October 2, 2010

దొంగ నిద్ర

                     మా కొత్తిల్లు ఎంత బాగుండేదో .ముందు, వెనకా ప్రహారీ . ఇంటి చుట్టురా బండలు వేయకపోవడం వల్లా డెర్బిస్ అంతా చదునుచేసి పోసి ప్రతీ రొజూ  కాసేపు దాన్ని నడవడానికి వీలుగా దిమ్మిస కొట్టి నీళ్ళు చల్లి కొద్ది,కొద్ది ప్రదేశాన్ని అమ్మే బాగు  చేస్తూ ఉండేది. నాన్నగారు సాయంత్రం వచ్చాక అందరమూ కలిసి తెప్పించి ఉంచిన మట్టిని ఎవరికీ వీలైనదానితో వాళ్ళం పట్టుకొచ్చి పోసేవాళ్ళం. అలాగా దాదాపు కొన్ని ఏళ్ళు బహుశ రెండు,మూడేళ్ళు అనుకుంటా మాకు మంచి వ్యాయామం  ఉండేది. మా పక్కింట్లో,కరెంటు వచ్చింది. కానీ మా ఇంట్లో దాదాపు 64 వరకు కూడా కిరసనాయిలి దీపాలతోనే చదువులు సాగేయి. మనింట్లో ఎందుకు కరెంటు లేదు అన్న ఆలోచన మాకేప్పుడు రాలేదు. ఉన్న దాంట్లో తృప్తిపడటమే మా ఇంట్లో అందరి స్వభావం.


                మా కొత్తింటి ముందు  అరుగు, వెనకాల పెద్ద వరండా దాదాపువరసగా 10,12    మంది దాకా వరసగా పడుకునేందుకు వీలుగా ఉండే వరండా ఉండేది. స్కూలు నించి రాగానే కాళ్ళు, మొహం కడుక్కుని, ఇంటిపని , హోంవర్కు పూర్తి చేసుకుని సరిగ్గా  సాయంకాలం 5 గంటలకల్లా అందరం పిల్లలం ఆటలాడుకునేందుకు పరిగేట్టేవాళ్ళం. ఎవరైనా ఆలస్యం చేసారా అంటే ఎదురు చూస్తున్న వాళ్లకి  ఆత్రత పెరిగిపోయేది.    ఎందుకంటే ఎంత ఆలస్యం చేస్తే అంత ఆటలాడుకునే  సమయాన్ని మిస్ అయ్యేవాళ్ళం. మళ్ళి సరిగ్గా 
6.30 ,7-౦౦ కంతా     చదువుకోవడానికి  తయారు కావాలి. 9-00 కంతా మా చదువులు పూర్తి చేసుకుని కాసేపు కధలు వింటూ, నాన్న దగ్గిర సంస్క్రుతం వల్లె వెస్తూ నిద్రలోకి జారుకునే వాళ్ళం.
                
              ఒక రోజు బహుశ ఆదివారం అనుకుంటాను,  అందరూ  కబుర్లలో పడి వీధి అరుగు మీద కూర్చున్నారు. మా అమ్మమ్మ గారూ అప్పుడే వచ్చారు. ఆవిడ వాళ్ళ ఉరి ముచ్చట్లు, ప్రయాణం కబుర్లు మాట్లాడుతుంటే  నేను నిద్రలోకి జారుకున్నాను. వీళ్ళందరి కబుర్లూ వింటూనే ఉన్నాను. నిద్ర పూర్తిగా రాలేదు అలాగని మెలుకువా  లేదు.  కానీ అన్దరూ లేచి లోపలి బయలుదేరితే మాత్రం లేచి నడుస్తూ వెళ్ళే  మూడూ    లేదు. ఇంతలో వాన మొదలయ్యింది. అందరు లేచి లోపలి వెళ్తూ, నన్నూ లేపారు. నేను లేస్తేగా, హాయి గా నిద్ర పోతున్నట్టు యాక్షన్  చేశా. ఇంకేముంది, మా నాన్న నన్ను ఎత్తుకుని హాయిగా లోపలికి   తీసికెళ్ళి  పడుకో పెట్టారు. విజయగర్వం తో మూసిఉన్న  కళ్ళతోనే ముసి ముసి నవ్వుల్నీ పసి కట్టిన అమ్మ ..ఇంక ఏముంది ......షరా ....అర్ధం చేసుకోండి మరి....

Friday, October 1, 2010

మా కొత్త ఇల్లు

        మేము అద్దె ఇంట్లో ఉన్నప్పుడే నాకు జ్ఞాపకం ఉండి ఒక సారి కొత్త ఇల్లు కట్టే దగ్గరికి అమ్మ, నాన్నగారు, ఇందిరక్క,అన్నయ్య, మా పెద్ద అక్క  వచ్చిందో, లేదో జ్ఞాపకం లేదు. వెళ్ళాం . బహుశ నాకు అప్పుడు 7 ఏళ్ళు ఉన్నాయనుకుంటాను
             అందరము వెళ్లి అక్కడ తవ్విన పునాదుల్లో దాగుడుమూతలు  ఆడుకున్నాము, .ఇంకా పెద్దవాళ్ళ  మాటలు పూర్తి కానందుకు  మళ్ళి కొనసాగించి దొంగా-పోలీసు ఆడుకున్నాము. ఎందుకో ఆ దృశ్యం  నాకింకా మరుగున పడలేదు. ఎన్నెన్నో జ్ఞాపకాలు,అలాగే ఎన్నెన్నో సంఘటనలు. స్మృతిపధంలోకి వెళ్లి, జాగ్రత్తగా నిక్షిప్తం అయినవి అముల్యమైనవే కావచ్చు, సాధారణమైనవి కూడా కావచ్చు.
           కొన్ని జ్ఞాపకాలు ఎందుకు మిగిలి పోతాయో మనకి తెలిదు, అలాగని ముఖ్యమైనవాటిని    కొన్నింటిని ఎందుకు మరిచి పోతామో కూడా తెలీదు  మరి. మళ్ళి ఇంటికి తిరుగు ముఖం పట్టేసరికి రాత్రి ఎనిమిది అయ్యింది. 
. .      ఆ తర్వాత జరిగిన గృహ ప్రవేశం కాని, కొద్దికాలంపాటు  జరిగిన సంఘటనలు కాని నాకెందుకో గుర్తుకి లేవు.