Thursday, October 28, 2010

నా జ్ఞాపకాలు – అనుభవాలు ( లెక్కలతో పోరాటం - 1

                          రవీంద్రనాథ్ మార్చాల

                                         
      బడిలో పిల్లలందరికి కష్టమైనది, ఇష్టం లేనిది, విసుగుతెప్పించేది ఎదైనా వుంది అంటే అది MATHSమాత్రమే….చిన్నపుడు, మన చదువు మహా దారుణంగా సాగేది. అసలు ఆ సమయం లో బడి కి వెళ్ళేది చదువుకోవటానికి అని తెలీక, తోటి పిల్లల్ని కొట్టటం ఇంటికి జనాల్ని తీసుకు రావటం మన దినచర్య గా వుండేది. 

          అందరిలా నేను పలక మీద అక్షరాలు, అంకెలు త్వరగానే నేర్చుకున్నా...పలక మీద సీనియారిటి సాధించాక పుస్తకాలు వచ్చాయి...గుట్టు చప్పుడు కాకుండా వాటితోనే ఎక్కాల పుస్తకం కూడ చేరింది ....అ రోజు అలా చాటుగా ప్రవెశించిన దాన్ని పోన్లే చిన్న పుస్తకం, మహా అయితె ఒక 10 పేజిలు అనుకుని వదిలేశా...... అపుడు తెలీలేదు, "ఒక చిన్న పుస్తకం నా బల్యాన్ని మింగేస్తుంది అని... 

సరేలెమ్మని "కమిట్ అయ్యాం, ఏటి సేత్తాం" అనుకుని పుస్తకాలన్ని సర్ది పెట్టె లో పెట్టి తాళం వేసాను...అలా నా జీవితం లో లెక్కలు అనే 'విలన్ ' ముందు వామన అవతారంలా చిన్నగా ఎక్కాల పుస్తక రూపంలో ప్రవేశించింది....

చిన్నపుడు ప్రైవేటు శాస్త్రి మాస్టారి దగ్గర, ఆయన నాతొ నోటి తో కంటే, బెత్తం తోనే ఎక్కువ మాట్లాడేవారు...పైగా ప్రతి ఆదివారం ఎక్కాలు అప్పజెప్పాలి..ఆదివారం వస్తుందని నాకు సోమవారం నుంచే భయంగా వుండెది...మొదట్లో ఎక్కాలు ( అంటే 1 నుంచి 6 వరకు) తేలిగ్గానే వున్నట్లుగా వుండేవి ( మన బుర్ర లో వున్న fuel అక్కడి దాకానే సరిపొయింది) ...తర్వాత 7 వ ఎక్కం అంటేనే ఏడుపు వచ్చేది...దానితో కొన్నాళ్ళు పోరాడాల్సి వచ్చింది...అలా లాక్కుంటూ, కుంటుకుంటూ 13 వ ఎక్కం వరకు వెళ్ళి, ఇక బండి లాగ లేక ఆపేసాను...అపుడపుడు మాస్టారు, బెత్తం తో రీచార్జ్ చేస్తే మళ్ళా కాస్త కదిలేది. అలా బడి జీవితం 20 వ ఎక్కం వరకు వెళ్ళకుండానే ముగిసింది...

ఇంకా ప్రెవేటు లో ఎక్కాల బాధలు కాకుండా లెక్కల పరీక్షలు వుండెవి...నాకేమో అవి జీవితానికే పరీక్ష లా వుండెవి...ప్రతి పరీక్ష ఎలా తప్పించుకోవాలి అన్న ఆలొచన తోనే సమయం గడిచిపొయేది. ఇంకా చదవటానికి సమయం ఏది, పాస్ అయ్యే అవకాశం ఏది...ప్రతి పరీక్ష లో ఫెయిల్ అవుతూ..మస్టారి దగ్గర "వీడిక లెక్కల్లో పాస్ అవ్వడు" అనే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వుండేవాడిని...అపుడె ఒక వర్షం కురిసిన రాత్రి, ఇంట్లో కరెంటు పోవడం మనకి ఆలోచన రావటం ఒక్కసారే జరగలేదు, ఒక గంట తేడాగా జరిగాయి...
బడి పరీక్షల్లో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు వుండేవి...మనకి కూడికలు తప్ప తీసివేతలు కూడా వచ్చేవి కాదు...ఎమైనా అంటే అప్పు తెచ్చుకోవలి అనేవారు...అప్పటికి మనకి ఇంకా అప్పులు ఎవరు ఇస్తారో తెలీదు కదా...అందుకని మన గణితావధానం కూడికలతో ముగిసేది...

ఇలా కాదని షార్ట్ కట్ కోసం ప్రెవేటు చుట్టు పక్కల గాలించసాగాను...అక్కడే దొరికాడు, సుబ్బి గాడు...వీడు కాస్త "  + , - , * , / " చేసేవాడు...( అందుకే కావొచ్చు, వీడు ఇపుడు బ్యాంక్ గుమస్తా గా రాణిస్తున్నాడు.)...ఇక అప్పటి నుంచి మాస్టారి ప్రత్యేక దృష్టి నా మీది నుంచి మరల్చటం కోసం, నా దూర దృష్టి ( కాపి చేయటం) మెరుగుపరచుకున్నా....కాని కాలం కలసి రాక ఎపుడైనా రాహువు వక్ర దృష్టి తో చూసినపుడు గోడ కుర్చి వేసి, కింద వెళ్ళె చీమల్ని లెక్కపెట్టేవాడిని...ఇలా  ఆదివారాలు, గోడ కుర్చీలు నా చిన్నప్పటి డైరి లో నాగార్జున, టాబు లా కలిసిపోయాయి..
ఒకసారి బడి లో పెట్టిన పరీక్ష లో, వేరే ఎవ్వరికి రాని మార్కులు వచ్చినందుకు టీచర్ మనకి ఒక బిరుదు కూడా ఇచ్చింది..( మనకి వచ్చిన మార్కులు "సున్నా" ).               

No comments: