Wednesday, September 29, 2010

బాల్యం అంతా ఆటగా ,

బాల్యం అంతా ఆటగా ,
మనసే చల్లని మాటగా,
బ్రతుకే పున్నమి బాట గా ,
బ్రతుకంతా శ్రుతిలో కలిసిన పాటగా నే పాడనా...

         అలా పాడుకుంటుంటే ఎందుకో బ్రతుకంతా శ్రుతిలో కలిసిన పాటగానే మిగలనా    అంటూ అనాలోచితంగా నా నోట్లోనించి వచ్చేసింది . వామ్మో

, ఎంత అదృష్టం కావాలి అలా మిగలడానికి . మళ్ళి జన్మంటూ  ఎత్తితేఅక్షరమై పుట్టి, ఒక మాహమహుని మనసులో చేరి   వారి కలం లోంచిఅధ్బుతమైన పాట గా రూపు దిద్దుకోవాలి. 
              ఎందుకో ఎంతెంతో పిచ్చి,పిచ్చిగా ఆలోచిస్తున్నానేమిటో .
      సరే. యీ జన్మలో పాపాలన్నీ కడతేరి నప్పుడు కదా మరో జన్మ వగైరా.

           చిన్నప్పుడు మన ప్రతి అవసరానికి పెద్ద వాళ్ళే ఆధారం. అప్పుడు మనకి అన్ని పనులు చేయడం అంటే  వాళ్లకేంతో ఆనందం.

     బాల్యం దాటి తప్పటడుగులు వేస్తున్నప్పుడు ప్రతి అడుగుకి తల్లి కళ్ళలో వెలుగు తండ్రి కి భరోసా. పెద్దయాక వీడు నన్ను నడిపిస్తాడనే ధీమా. వెరసి 
బాల్యం అందంగానో  , ఆనందంగానో కొందరికి , పరిస్తితుల్ని బట్టి బాధగా, భారంగా కొందరికి మొత్తానికి కదులుతుంది.
               కాస్త కదిలి తనకు తానుగా నడవడం, మాట్లాడం  వచ్చి రాని మాటలతో మురిపించడం. అలాంటి సమయం లోనే మా నాన్నగారు మాకు దాదాపు మా తోబుట్టువులందరికి      రామః, రామౌ రామాహా,,  అంటూ  శబ్దమంజరి, , యస్స్య జ్ఞాన దయా సిందో అంటూ అమరం , హరిహి ఓం అంటూ ప్రారంభించి శ్రీసూక్తం   ప్రతి రోజు వల్లే వేయించే వారు. అలా వాళ్లకి సమయం కూడా కుదిరేది. నాన్నగారు వైద్యానికి వెళ్లి పోగానే అమ్మ చుట్టూ( వంట అయి కంచంలోకి వచ్చే దాకా )తిరుగుతూ ఆవిడ పాడే 
పాటల్ని మనసునిండా మా ప్రమేయం లేకుండానే నింపుకున్నాం 

   పరిగెత్తుతూ ఆటలాడుతూ తుత్తురు చెట్టు కింద కందిలి  పెట్టుకుని అక్కావాళ్ళు  చదువు కుంటుంటే , వాళ్ళ చుట్టూ తిరుగుతూ రాలిపడ్డ తుత్తురు పళ్ళని ఏరుకుని తినటం, వాటికోసం అన్నయ్య వాళ్ళ
 చదువుల్ని డిస్టర్బ్ చేసి అమ్మతో తిట్లు తినటం , ఆవిడ తిట్టకుంటే తుత్తురు పళ్ళు రుచిగా నే అనిపించేవే కావుమరి  అలా ఆనందించే వాళ్ళం.

    కొద్దిగా తెలివి వచ్చి బడికి వెళ్ళే వయసు వచ్చేనాటికి మేము ఇల్లు మారి సొంత ఇంటికి వచ్చేసాం. అయినా మా ఇంటిముందు ఇనప బెంచి మీద నించుని హోలిపండగా రోజు మేము తీయించుకున్న ఫోటో మాకు  ఆఇంటిని ఇప్పటికి మా  జ్ఞాపకాల్లోంచి  మరుగు కానివ్వలేదు  .అలాంటి   జ్ఞాపకాలు
మా పిల్లలకి అంత మధురంగా ఉన్నాయా  అసలున్నాయా అని ఆలోచిస్తే ఉన్నాయా ?అనే 
అనిపిస్తుంది.

      

2 comments:

నాగేస్రావ్ said...

చాలా బాగున్నాయి మీ జ్ఞాపకాలు.
తుత్తురు పళ్ళంటే ఏమిటండీ?

bloggerbharathi said...

ధన్యవాదాలు.
తుత్తూరు పళ్ళు అంటే మల్బరీ పళ్ళు పుల్ల పుల్లగా , కాస్త పండినాక తియ్య తియ్యగా ఉంటాయి. చిదిపితే ఎర్రగా ఉంటై. వాటిని బొంతపళ్ళు అని తెలంగాణా ప్రాంతంలో అంటారు.